కృష్ణ! త్వదీయ పదపంకజ పంజరాన్త

27 Nov

ముగ్గురు కవులు ,ముగ్గురూ భక్తి సామ్రాట్టులే ,ముగ్గురూ భగవంతుని పరి పరి విధాలుగా స్తొత్రం చేసినవారే.ముగ్గురూ మూడు శతాబ్దాలకు చెందినవారు .కానీ ముగ్గురూ భక్తి భగవన్నామస్మరణ విషయం లో ఒకేలా స్పందించారు.
శ్లో
కృష్ణ! త్వదీయ పదపంకజ పంజరాన్త
మద్వైవ మే విశతు మానసరాజహంసః
ప్రాణప్రయాణసమయే కఫవాత పిత్తైః
కంఠావరోధనవిధౌ స్మరణం కుతస్తే||

ఇది ముకుందమాల లో కులశేఖరులు  శ్రీకృష్ణ పరమాత్మని ఉద్దేశించి  చెప్పుకున్న శ్లోకం. ఇక ఈ శ్లోక భావం ఇది .
ఓ కృష్ణా!నా మనస్సనెడి రాజహంస యిపుడే నీపాదపద్మములనెడి పంజరమును ప్రవేశించుగాక. ఎప్పుడో ఆఖరిదశయందు నీనామస్మరణ చేయుదమనుకొనుట భ్రమగదా!ఏలనన మరణసమయమందు కఫవాతపిత్తములచే గొంతు నిరోధించబడి యున్నపుడు నిన్ను స్మరించుట యెట్లు సాధ్యమగును?
అంతే కాదు, ప్రాణప్రయాణ సమయం అందరకూ ముందుగా తెలియదు కదా!అందుచేత ఇప్పుడే ఈ క్షణమందే నా మనస్సును నీయందు లగ్నమయ్యేలా చేయి ప్రభూ!

దీనినే భక్త రామదాసు గారు  తన దాశరథీ శతకం లో చెప్పారు

ముప్పునఁ గాలకింకరులు ముంగిట వచ్చిన వేళ, రోగముల్
గొప్పరమైనచోఁ గఫము కుత్తుక నిండిన వేళ, బాంధవుల్
గప్పిన వేళ, మీ స్మరణ గల్గునొ గల్గదొ, నాటికిప్పుడే
తప్పక చేతు మీ భజన దాశరథీ కరుణాపయోనిధీ!

ఇదే భావాన్ని  నరసింహ శతక కర్త కూడా తన పద్యం లో చెప్పారు 

బ్రతికినన్నాళ్ళు  నీ భజన తప్పను గాని,మరణకాలమునందు మఱతు నేమో ?
య వేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునపుడు
కఫవాత పైత్యముల్  కప్పగా భ్రమ చేత గంప ముద్భవమంది ,కష్టపడుచు
నా జిహ్వతో నిన్ను నారాయణా! యంచు పిలుతునో శ్రమ చేత పిలవలేనో ?
నాటికిపుడే  చేసెద నామభజన
దలచెదను జేరి వినవయ్య ! ధైర్యముగను !
భూషణ వికాస ! శ్రీధర్మపురి నివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

ఈ రెండు పద్యాల భావం కూడా ఇదే.  స్వామీ  చివరి రోజులలో నీ నామస్మరణ చేసుకోగలమో  లేమో!ఆ రోజున ఎన్ని అడ్డంకులు వస్తాయో ! ఆరోగ్యం సహకరించదు అందుకు  ఈ రొజే నీ నమస్మరణ చెసుకుంటాము .చెవినొడ్డి వినవయ్యా అని.

భక్తి కలిగిన హృదయాలు అలా మాట్లాడాయి.వాళ్ళ భక్తి ని ఏమని చెప్పేది.

One Response to “కృష్ణ! త్వదీయ పదపంకజ పంజరాన్త”

  1. samputi Admin June 18, 2013 at 12:21 pm #

    మరికొన్ని శతకముల కొరకు ఈ క్రింది లింకుని చూడండి.
    http://www.samputi.com/launch.php?m=home&l=te

Leave a comment