శ్రీ రామ చంద్రం శిరసా నమామి

11 Apr

శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం

సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం

ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం

రామం నిశాచర వినాశకరం నమామి

అంటూ మనం శ్రీరామ చంద్రుని జన్మదినోత్సవాన్ని జరుపుకునే చైత్ర శుధ్ధ నవమి రానే వస్తోంది ఆ మర్యాదా పురుషోత్తముని గూర్చి ఆయన యొక్క మహనీయతను గూర్చి రెండు ముక్కలు చెప్పుకుని తరిద్దామని ఈ ప్రయత్నము.

ఈ భరత దేశం లో ధర్మ బధ్ధ జీవనానికి ఒక నిలువెత్తు నిర్వచనం గా ,మనిషి ఇలా బ్రతకాలి, అని ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి మానుష్య జన్మకున్న వైశిష్ట్యాన్ని మనకి ఆవిష్కరించిన మర్యాదా పురుషోత్తముడు నా తండ్రి శ్రీ రామ చంద్ర మూర్తి.

రామాయణము:

అయనము అంటే నడక అని అర్థం . రామాయణము అంటే రాముని యొక్క నడక అని అర్థం.

మీరు చూడండి శ్రీ మహవిష్ణువు యొక్క దశావతారములలో ఒక్క రామావతారము లో తప్ప ఇక ఏ అవతారము గూర్చి ప్రస్తావించినా పెద్దలు అయనము అన్న మాట వేయ లేదు ,ఎందుకు ? రామావతారం లొ స్వామి పరిపూర్ణముగా మనవుడే , అందుకే ఎక్కడా రాముడు తాను దేవుడి నని కాని , దైవత్వమును ప్రకటించడము కాని చేయడు . ఆయన ఆ అవతారం లో మానవునిగానే జీవించాడు .అంతా బాగుందండీ కాని మరి “రామస్య ఆయనం రామాయణం” కదా మరి రాముని కదలిక కి అంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది ? అంటే ఆయన అడుగు తీసి అడుగు వేస్తే అది ధర్మం మరొ అడుగు వేస్తే అది సత్యం .ఆయన నడక ఆయన కదలిక అంతా సత్య -ధర్మములే. అందుకే కదండీ “రామో విగ్రహవాన్ ధర్మః ” అన్నారు .

అందుకే పెద్దలు తరుచు ఒక విషయం చెప్తారు రామాయణాన్ని నరుడి కథ గా చదవండి అని, ఎందుకంటే రామాయణాన్ని నరుడి కథ గా మనం చదివినప్పుడు రాముని నడువడిని చూసినప్పుడు ఒక నరుడు సత్యాన్ని ధర్మాన్ని పట్టుకొని ఇలా జీవించ గలడా, అని మనం కూడా ఆ గుణాలని అలవర్చుకొనే వీలుంటుంది.

రామ  శబ్దం :

అసలు “రామ” శబ్దం లోనే గొప్పతనం ఉంది .”ఓం నమో నారాయణాయ” అన్న అష్టాక్షరీ మహమంత్రం లోని “రా” బీజాక్షరాన్ని “ఓం నమః శివాయ” అన్న పంచాక్షరీ మహామంత్రం లోని “మ” బీజాక్షరాన్ని తీసుకువచ్చి “రామ” అన్న పేరుని దశరథాత్మజునికి వశిష్టులు పెట్టారు అని అంటారు, “రమయతి ఇతి రామః ” అని ఉక్తి .రామ అన్న మాట తోనే హృదయము రమిస్తుంది అందుకు కాదా “శ్రీ రామ నీ నామమెంతో రుచిరా” అని రామదాసు గారు ఎలుగెత్తి పాడినది. అలాగే రామ అని మనం అనే టప్పుడు ‘రా’ అక్షరం పలికేటప్పుడు నోరు తెరుచుకొని మనలోని పాపములు బయటకు వచ్చి దహింపబడతాయని…”మ” అక్షరం పలికే సమయం లో నోరు మూసుకొని బయట ఉన్న పాపములు లోనికి రాకుండా ఉంటాయని ఆర్యోక్తి.అలాగే “రా” అన్న అక్షరం భక్తులను సంసార సాగరం నుండి రక్షిస్తే ,”మ” భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తుందని పెద్దలైన వారు నిర్వచించారు .

సహస్రనామ తత్తుల్యం:

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |

సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ||

పరమశివుడు పార్వతీ దేవి తో చెప్పిన ఈ శ్లోకం అందరికీ తెలిసినదే ,శ్రీ రామ రామ రామ అని మూదు సార్లు జపిస్తే శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేసిన ఫలము వస్తుందనేది ఈ శ్లోక భావం .

అదెలా అంటే కటపయాది సూత్రం ప్రకారం “య” వర్గం లో “రా” రెండవ అక్షరం కాగా “ప” వర్గం లో “మ ” ఐదవ అక్షరం రెండు * ఐదు =పది కదా , దీనిని బట్టి ఒక సారి రామ అంటే పది సంఖ్య కు సంకేతం .ఇక మూడు సార్లు జపిస్తే 10*10*10 =1000 కి సమానమవుతుంది . అందుకే పరమశివుడు అలా నిర్వచించాడు అని.

శ్రీ రామ నవమి:

ఇహ స్వామి జన్మించినది నవమి నాడు ,ఇన్ని తిథులు ఉండగా స్వామి నవమి నాడే ఎందుకు జన్మించాడంటే నవమి పరమేశ్వర తత్వాన్ని సూచిస్తుంది కనుక , పెద్దలు 9 సంఖ్య పరమాత్మని సూచిస్తుందంటారు , చూడండి 9 ని తీసుకొని మీరు ఎంత తోనన్నా హెచ్చ వేయండి మీకు మళ్ళీ 9 ఏ వస్తుంది.

9*1=9

9*2=18 ——– 8+1 =9

9*3=27 ——– 2+7=9

9*4=36 ——– 3+6=9

9*5=45 ——– 4+5=9

ఇలా మీరు ఎంతతో అన్నా హెచ్చ వేయండి మీకు తొమ్మిదే వస్తుంది , ఇది పరమాత్మ తత్వానికి చిహ్నం ఆయన ఎన్ని రూపాలలో ఉన్నా ఎన్ని అవతారములు ఎత్తినా ఎన్ని పేర్లు పెట్టుకున్నా అసలుతత్వము ఒక్కటే అది తనని తాను ఎన్ని విధాలుగా సృజించుకున్నా అది అలాగే ఉంటుంది. ఇది నవమి నాడు ఆయన అవతరించడం వెనుక ఉన్న రహస్యం.

ఈవిధం గా అవతరించి నరుడి గానే చరించి, సత్య ధర్మాలను పట్టుకొని , పితృ భక్తి, ఏకపత్నీవ్రతము ,భ్రాత్రుప్రేమ ,కర్తవ్య నిష్ట వంటి సద్గుణములను సొదాహరణము గా చూపించిన ఆ శ్రీరామ చంద్ర ప్రభువు యొక్క పాదపద్మములకు సాంజలి బంధకముగా నమస్కరిస్తూ ఆ ప్రభువు యొక్క కృప మనపై వర్షించాలని కోరుకుంటూ  ఈ శ్రీ రామ నవమి నాడు ఆయనని సుతిస్తూ  మన జీవితా లని పండిచుకుందాం.

మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే

చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం

 

ఇవన్నీ మీకు తెలియవనీ కాదు , నాకేదో తెలుసనీ కాదు , నేను చెప్తే మీరు విని నేర్చుకోవాలనీ కాదు ,ఈ విషయాలలో నేను అందరికన్న చిన్న వాడినే,ఆ మర్యాదా పురుషోత్తముని గూర్చి ఆయన యొక్క మహనీయతను గూర్చి రెండు ముక్కలు చెప్పుకుని తరిద్దామని  ఈ  ప్రయత్నము తప్ప మరే ఉద్దేశమూ లేదు.


స్వస్తి .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: