గంటమొ చేతిలోది ములుగఱ్ఱయొ ?

29 Oct

 

         పోతనామాత్యుల పద్యములు ఇష్టపడని వారు ఉండరేమో,చదువుకోవడానికి ఎంత హాయిగా ఉంటాయో, అద్భుతమైన భావము, పొంగిపొర్లే భక్తిరసము, శివకేశవ అభేదము,అలా అని పెద్ద కష్టమైన పదములు, పెద్ద పెద్ద సమాసములు ఏమీ ఉండవు.సులువుగా అందరికీ అర్ధమయ్యేలా లలితంగా హాయిగా ఉంటాయి.

          వారి జీవితం లో వారు పాటించిన నిరాడంబరత ,వారి యొక్క భక్తి తత్పరత శ్లాఘనీయములు.అంతటి భాగవతాన్ని ఆంధ్రీకరించిన ఆయన , ఏనాడూ అది తన గొప్పతనంగా చెప్పుకోలేదు, “పలికించు విభుండు రామభద్రుండట” అనే అన్నారు,అలాగే ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎంత ధనం ఇస్తామన్నా  వారు రాజులకు  భాగవతాన్ని అంకితం ఇవ్వలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా ,ధైర్యంగా నిలదొక్కుకొని  “సత్కవుల్ హాలికులైన నేమి” అంటూ వ్యవసాయం చేస్తూనే జీవితాన్ని గడిపారు.   

అంతటి గొప్ప పోతన గారి మీద ఎవరైనా పద్యములు వ్రాస్తే, అవీ పోతనామత్యుల  పద్యాలలా లలితంగా అద్భుతం గా ఉంటే ఎంత అద్భుతం గ ఉంటుంది …

         జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు (కరుణ శ్రీ గారు) మహాకవి పోతన మీద వ్రాసిన పద్యాలు ఇవి.ఎంత అద్భుతమైన పద్యాలో చూడండి . గజేంద్ర మోక్షం పై ఉపన్యసిస్తూ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు , పోతనామాత్యుల గొప్పతనాన్ని చెప్పటానికి ఈ పద్యాలనుదహరించారు. అప్పుడు వీటిని విన్నాను, సరే అని అంతర్జాలం (Internet) లో వెతికి దొరికిన వాటిని ఇక్కడ పెడుతున్నారు.

potanaamatyulu

  గంటమొ చేతిలోది ములుగఱ్ఱయొ ? నిల్కడ యింటిలోననో

పంటపొలానొ ? చేయునది పద్యమొ సేద్యమొ ? మంచమందు గూ

ర్చుంటివొ మంచెయందొ ? కవివో గడిదేరిన కర్షకుండవో ?

రెంటికి చాలియుంటివి సరే ! కలమా హలమా ప్రియం బగున్ ?

ఉ.

కాయలు గాచిపోయినవిగా యరచేతులు ! వ్రాతగంటపున్

రాయిడిచేతనా ? మొరటు నాగలిమేడి ధరించి సేద్యమున్

జేయుటచేతనా ? కవికృషీవల ! నీ వ్యవసాయదీక్ష ” కా

హా ” యని యంతలేసి కనులార్పక చూచిరిలే దివౌకసుల్ !

ఉ.

“నమ్ముము తల్లి నాదు వచనమ్ము ; ధనమ్మునకై బజారులో

అమ్మనుజేశ్వరాధముల కమ్మను ని ” న్నని బుజ్జగించి నీ

గుమ్మములోన నేడ్చు పలుకుం జెలి కాటుకకంటి వేడి బా

ష్పమ్ములు చేతితో తుడిచివైచెడి భాగ్యము నీకె యబ్బెరా ! !

ఉ.

కమ్మని తేటతెల్గు నుడికారము లేరిచి కూర్చి చాకచ

క్యమ్ముగ కైత లల్లు మొనగాండ్రు కవీశ్వరు లెంతమంది లో

కమ్మున లేరు – నీవలె నొకండును భక్తి రసామృత ప్రవా

హమ్ముల కేతమెత్తిన మహాకవి యేడి తెలుంగు గడ్డపై ?

సీ.

భీష్ముని పైకి కుప్పించి లంఘించు గో

పాలకృష్ణుని కుండలాల కాంతి

కరిరాజు మొఱపెట్ట పరువెత్తు కఱివేల్పు

ముడివీడి మూపుపై బడిన జుట్టు

సమరమ్ము గావించు సత్య కన్నులనుండి

వెడలు ప్రేమక్రోధ వీక్షణములు

కొసరి చల్దులు మెక్కు గొల్ల పిల్లల వ్రేళ్ళ

సందు మాగాయి పచ్చడి పసందు

గీ.

ఎటుల కనుగొంటివయ్య ! నీ కెవరు చెప్పి

రయ్య ! ఏరాత్రి కలగంటివయ్య ! రంగు

కుంచెతో దిద్దితీర్చి చిత్రించినావు !

సహజపాండితి కిది నిదర్శనమటయ్య ! !

ఉ.

ముద్దులుగార భాగవతమున్ రచియించుచు, పంచదారలో

నద్దితివేమొ గంటము మహాకవిశేఖర ! మధ్య మధ్య అ

ట్లద్దక – వట్టిగంటమున నట్టిటు గీచిన తాటియాకులో

పద్దెములందు – ఈ మధుర భావము లెచ్చటనుండి వచ్చురా ?

ఉ.

ఖ్యాతి గడించుకొన్న కవు లందరు లేరె ! అదేమి చిత్రమో

పోతన యన్నచో కరిగిపోవు నెడంద, జోహారు సేతకై

చేతులు లేచు ; ఈ జనవశీకరణాద్భుతశక్తి చూడగా

నాతని పేరులో గలదొ ; ఆయన గంటములోన నున్నదో !

పోతన వైభవాన్ని చెబుతూ ,భావము చాలా సులువు గా అర్థం అయ్యేలా ఎంత గొప్ప రచన చేసారండీ కరుణ శ్రీ గారు. ఇలాంటి పద్యాలు ఇచ్చిన వారికి మనం ఋణపడిఉన్నాం. 

ఈ పద్యాలు నాకు దొరికిన లంకె ఇది .

http://kasstuuritilakam.blogspot.com/2010_03_14_archive.html

One Response to “గంటమొ చేతిలోది ములుగఱ్ఱయొ ?”

  1. sasikala June 16, 2012 at 7:55 pm #

    pothana manavadavatam manam chesukunna adtushtam. emi kavitha patima!
    maanava janma eththinanduku tanadi, chadivinaduku manadi kuda saardhakam chesadu mahanubhavudu!
    ee rojullo inthamanchi telugu ardham chesukovadam atunchi, chadavataniki enthamandi aandhrulaki norutirugutundi? veellaki atu english poorthiga raadu sarigada, chakkati maatrubhasha anthakante raadu. ubhaya bhrashtatwam! kaneesam addamaina chetta vadili kaneesam ilantivi oka upavachakamga pedithe bagundunu. evariki padutundi ee gola!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: