Tag Archives: manachi slokamulu in telugu

మనాచీ శ్లోకములు (201—205)

28 Sep

201.    కదా వోళఖీమాజి దూజే దిసేనా

            మనీ మానసీ ద్వైత కాంహీ |

            బహూతాం దిసాం ఆపులీ భేటి జాలీ

            విదేహీపణే సర్వ కాయా నివాలీ || శ్రీ రాం ||

 మనసా! అట్టి ఉన్మనీ స్థితి యందు రెండవ పదార్థము గాని , పదార్థ భాసమానముగాని  యుండుట కవకాశము లేదు.అనేక జన్మల ఫలితముగ కడపట సాధకుడు తన స్వరూప మందు ఐక్యమగుచున్నాడు. దేహబుధ్ధులు సంపూర్ణముగ  నశించియుండుటచే  లవణము సముద్రమున కలిసి,తన్మయమొందునదిగా సాయుజ్య పదవినందుచున్నాడు. 

202.   మనా గూజరే తూజహే ప్రాప్తజాలే

            పరీ అంతరీ పాహిజే యత్న కేలే |

            సదా శ్రవణే పావిజే నిశ్చయాసీ 

            ధరీ సజ్జనీ సంగతీ ధన్య హోసీ  || శ్రీ రాం ||

మనసా! ఇట్టి పరమగుహ్యమైన ఆత్మజ్ఞాన ధనము నీకు సంప్రాప్తమైనను ,దానిని సంరక్షించుకొనుటకై అనగా అట్టి స్థితి అఖండముగ నుండుటకై  సజ్జన సాంగత్యమునందు ఆధ్యాత్మ శ్రవణము   గావించుచుండుము.

203.    మనా సర్వహీ సంగ సోఢూని ధ్యావా

             అతీ ఆదరే సజ్జనాచా ధరావా |

             జయాచేని సంగే మహాదుఃఖ భంగే

             జనీం సాధనావీణ సన్మార్గ లాగే || శ్రీ రాం ||

 మనసా! ప్రపంచ వాసనలు వీడి,యత్యంతాదరముతో సజ్జన సాంగత్యమును నాశ్రయింపుము.అట్టి సత్సాంగత్యముచే సంసార దుఃఖములు నశించి,యెట్టి సాధన, యెట్టి ప్రయాసములు లేకయే ఆత్మజ్ఞానము కలిగించు రాఘవుని భక్తిమార్గము సులభముగ లభ్యమగును.

204.    మనా సంగా హా సర్వ సంగాస తోడీ

             మనా సంగా హా మోక్ష తత్కాళ జోడీ |

             మనా సంగా హా సాధకాం శీఘ్ర  సోడీ

             మనా సంగా హా ద్వైత నిశ్శేష మోడీ || శ్రీ రాం ||

 మనసా! అట్టి సజ్జన సాంగత్యము మానవుని సంసార సాగరము నుండి విడిపించి,దుస్తర సంసార సాగరము నుండి సాధకుని సంరక్షించి, దైత్య బుధ్ధులనను సమూలముగ నాశము గావించి మోక్షసుఖమునిచ్చుచున్నది .

 205.    మనాచీ శతే ఏకతాం దోష జాతీ

              మతీమంద తే సాధనా యోగ్య హోతీ

              చఢే జ్ఞాన వైరాగ్య సామర్థ్య అంగీ

              హ్మణే దాస విశ్వాసతాం ముక్తి భోగీ ||శ్రీ రాం||

 మనసా! యీ మానస బోధ శ్లోకశ్రవణముచే  సర్వ దోష పరిహారమై మూర్ఖుడు గూడ పరమార్థ  సాధనాధికారము పొంది,జ్ఞాన వైరాగ్య  సామర్థ్యముల సంపాదించి విశ్వాసముక్తుడైనచో ముక్తి సుఖమును భోగింపగలడు. 

సంపూర్ణము

శ్రీ రామచంద్రార్పణమస్తు

జై జై రఘువీర సమర్థ

సమర్థ సద్గురు శ్రీ శ్రీ శ్రీ సాయి సుందరం మహరాజ్ కీ జై

 

మనాచీ శ్లోకములు (196—200)

24 Sep

196.    నభీ వావరే జో అణురేణు కాంహీ

           రితా ఠావ యా రాఘవేవీణ నాహీ |

           తయా పాహతాం  పాహతాం తేచి జాలే

           తెథే లక్ష ఆలక్ష సర్వే బుడాలే ||శ్రీ రాం||

మనసా! ఆకాశమున సంచరించెడి అణురేణువులు మొదలు బ్రహ్మపర్యంతము రాఘవుడు లేని ప్రదేశము గనిపింపదు. అట్టి రాముని చూడ చూడ సాధకుడు రామ రూపమొందుచున్నాడు. అట్టి రామ రూపమందు లక్ష్యాలక్ష్య భావములన్నియు లీన మగుచున్నవి.  

 197.    నభాసారిఖే రూప యా రాఘవాచే

            మనీ చింతితాం మూళ తూటే భవాచే |

            తయా పాహతాం దేహబుధ్ధీ ఉరేనా

            సదా సర్వదా ఆర్త పోటీ పురేనా ||శ్రీ రాం||

 మనసా! రాఘవుని స్వరూపము గగనము వలె వ్యాపకమై, అట్టి స్వరూపమును చింతింప భవబీజములు నాశనమగుచున్నవి. అట్టి స్వరూపము దర్శించువానికి దేహబుధ్దులుండజాలవు. అట్టి దర్శనమొందిన వాడు ,తనివిదీరక రాఘవస్వరూపమునే దర్శించుచు, యితర చింతల మాని యుండును.

 198.     నభే వ్యాపిలే సర్వ సృష్టీస ఆహే

            రఘూనాయకా ఊపమా తే సాహే |

            దుజేవీణ జో తోచి తో హా స్వభావే

            తయా వ్యాపకూ వ్యర్థ కైసే హ్మణావే  ||శ్రీ రాం||

 మనసా! రాఘవ స్వరూపమునకు గగనమును బోల్చుట యుచితము గాదు. ఎందుకన, ఆకాశము సృష్టినంతయు వ్యాపించి యుండినను, వ్యాప్యమగు రెండవ పదార్థము గగనము కన్న భిన్నముగనున్నది, రాఘవ స్వరూప భిన్నమగు పదార్థము మరియొకటి లేకుండుటచే వ్యాప్య వ్యాపక భావములు  రామరూపమందుండజాలవు. రామరూప మొక్కటియే సత్యముగావున రెండవ  పదార్థమున కందుచోటు లేదు.

 199.        అతీ జీర్ణ విస్తీర్ణ తే రూప అహే

                తెథే తర్క సంపర్క తోహీ సాహే |

                అతీ గూఢ తే దృఢ తత్కాళ సోపే

                దుజేవీణ జే ఖూణ స్వామీప్రతాపే ||శ్రీ రాం||

 మనసా! బ్రహ్మస్వరూపము సనాతనమై, అఖండమై తర్క సంపర్కముల కతీతముగ యున్నది. అట్టి వస్తువు అత్యంత గూఢమైయ్యును,సద్గురు ప్రసాదముచే సులభముగ ప్రాప్తమై అద్వయానందము కలిగించుచున్నది.

 200.       కళే ఆకళే రూప తే జ్ఞాన హోతాం

                తెథే ఆటలీ సర్వసాక్షీ అవస్థా |

                మనా ఉన్మనీ శబ్ద కుంఠీత రాహే

                తొ గే తోచి తో రామ సర్వత్ర పాహే ||శ్రీ రాం||

 మనసా! సద్గురుకృప చే అట్టి జ్ఞానము కలిగినచో, రామ స్వరూప మిట్టిదియని అనుభమునకు వచ్చుచున్నది.అట్టియనుభవ దశ ప్రాప్తించిన తోడనే అట్లు ప్రాప్తించిన వాడు తాను రామ రూప సుఖమును  అనుభవించుచున్నాననెడి  తురీయావస్థను దాటి వాజ్ఞ్మనముల కతీతమగు స్థితిని బొంది, త్రిపుటి నిరహితమగు స్థితియందు లీనుడగుచున్నాడు.

మనాచీ శ్లోకములు (191—195)

22 Sep

191.   దెహే నిశ్చయో జ్యా ఢళేనా

          తయా జ్ఞాన కల్పాంతకాళీ కళేనా |

          పరబ్రహ్మ తే మీపణే ఆకళేనా

          మనీ శూన్య అజ్ఞాన హే మావళేనా ||శ్రీ రాం||

 మనసా ! దేహబుధ్ధులు వదలక, దృఢమై యుండునో, అట్టి వానికి కల్పాంతకాలము వరకు, పరబ్రహ్మ యొక్క అనుభవము, ఆత్మజ్ఞానముల వడజాలదు.అహంకారముండువరకు అజ్ఞానము అంత మొందజాలదు.

192.  మనా నా కళే నా ఢలే రూప జ్యాచే

          దుజేవీణ తే ధ్యాన సర్వోత్తమాచే  |

          తయా ఖూణ తే హీన దృష్టాంత పాహే

          తెధే సంగ నిస్సంగ దోనీ నసాహే  || శ్రీ రాం ||

 మనసా! అత్మర్క్యమగు రూపముగల పరబ్రహ్మ ధ్యానము దృష్టాంతములలో వర్ణింప నలవి కాదు. అద్వైత వస్తువును ద్వైత దృష్టాంతములు నిరూపింపజాలవు.పరబ్రహ్మ యందు సంగభావముగాని,నిస్సంగభావము గాని (రెండు కల్పనలేయగుటచే) ఉండజాలవు.

193.   నహ్వే జాణతా నేణతా దేవరాణా

           నయే వర్ణితాం వేదశాస్త్రాం పురాణాం |

           నహ్వే దృశ్య అదృశ్య సాక్షీ తయాచా

           శృతీ నేణతీ నేణతీ అంత త్యాచా || శ్రీ రాం ||

 మనసా ! పరబ్రహ్మముయందు జ్ఞానమును లేదు , అజ్ఞానము కూడా లేదు. యీ రెండు భావములకతీతము. వేదశాస్త్ర పురాణములు బ్రహ్మమును వర్ణింప జాలవు .పరబ్రహ్మ దృశ్యమును కాదు అదృశ్యమును కాదు. దృశ్యాదృశ్యములను గాంచెడి సాక్షీ కాదు. అది ఇట్టిదని వేదమే వర్ణింపలేకపోయెను కావున తర్కగమ్యమగు విషయము కాదు.

194.   వసే హౄదయీం దేవ తో  కోణ కైసా

           పుసే ఆదరే సాధకూ ప్రశ్న ఏసా |

           దేహే టాకితాం దేవ కోఠే రహాతో

           పరీ మాగుతా ఠావ కోఠే పహాతో ||శ్రీ రాం ||

 మనసా! సాధకుడాదరముచే ఇట్లు ప్రశ్నించుచున్నాడు ,హృదయమున వసించెడి భగవంతుడెవడు? అతడు ఎట్టి వాడు ? దేహము పడిపోయిన పిమ్మట అతడెచ్చటి కేగును ? ఎచ్చట నెవ్విధమున పునర్జన్మనొందును?  

195.   వసే హృదయీ దేవ తో జాణ ఏసా 

           నభాచే పరీ వ్యాపకూ జాణ తైసా |

           సదా సంచలా యేత నా జాత కాంహీ

           తయా వీణ కోఠే రితా ఠావ నాహీ ||శ్రీ రాం ||

 మనసా! భగవంతుడు ఆకాశము వలె సర్వవ్యాప్తియై,సర్వమున నిండియున్నవాడు, భగవంతునికి వచ్చుటయు  పోవుటయును సంభవింపదు. భగవంతుడు లేని ప్రదేశము అణుమాత్రమును లేదు. 

మనాచీ శ్లోకములు (186—190)

20 Sep

186.   సదా సర్వదా రామ సన్నీధ అహే

           మనా సజ్జనా సత్య శోధూని పాహే |

           అఖండిత భేటీ రఘూ రాజ యోగు

           మనా సాండి రే మీపణాచా వియోగు || శ్రీ రాం||

 ఓ మనసా ! అట్టి రామ స్వరూపము సర్వకాలము నీ చెంతనే ఉన్నది . నీవు శోధించి దానిని గుర్తించి కనుగొనవలయును . రామస్వరూప వియోగము నీకెన్నటికిని కలుగలేదు. అహంకారముచే నీవు రామస్వరూపమునకు భిన్నుడవని దలచుచున్నావు .అహంకారము త్యాగము గావించినచో నీవు రామస్వరూపుడవేయని తెలియగలవు .

187.    భుతే పిండ బ్రహ్మాండ హే ఏక్య ఆహే

            పరీ సహీ సస్వరూపీ న సాహే |

            మనా భాసలే సర్వ కాంహీ పహావే 

            పరీ సంగ సోఢుని సూఖీ రహావే || శ్రీ రాం||

ఓ మనసా! పాంచభౌతిక దృష్టిచే  పిండ బ్రహ్మాండములు సమానమై దృష్టి గోచరమగుచున్నవి గాని, ఆత్మస్వరూపమందు పంచభూతములకు స్థానము లేదు.భాసమానమగు ప్రపంచమును జూచుటగు దోషము కాదు గాని అట్టి ప్రపంచ వస్తువులందు సంగములేక యుండి నచో ఆత్మసుఖమును బొందగలవు. 

188.    దెహేభాన హే జ్ఞానశస్త్రే ఖుడావే

           విదేహీపణే భక్తిమార్గేచి  జావే |

           విరక్తీబళె నింద్య సర్వై త్యజావే

           పరీ సంగ సోడూని సూఖీ రహావే || శ్రీ రాం||

ఓ మనసా! అసంగమనెడి జ్ఞానశస్త్రముచే దేహబుధ్ధుల ఖండించి,దేహాతీతమగు ఆత్మవస్తువు నందు అనన్యుడవై సుఖింపుము. వైరాగ్యముచే నింద్యవస్తువు త్యాగము గావించి,సంగరహితుడవై సుఖింపుము.

189.    మహీ నిర్మిలీ దేహతో వోళఖావా

            జయా పాహతాం మోక్ష తత్కాళ జీవా |

            తయా నిర్గుణాలాగి గూణీ పహావే

            పరీ సంగ సోడూని సూఖే రహావే || శ్రీ రాం||

 ఓ మనసా!  ఏ భగవంతుడు  సృష్టినిర్మాణము  గావించియున్నాడో అట్టి భగవంతుని కనుగొనెడి మార్గమును బట్టుము. అట్టి భగద్దర్శనము అయినచో మోక్షము సిధ్ధించుట సులభము.నిర్గుణతత్వమును బొందుటకై సగుణోపాసన గావింపవలయును. సర్వసంగములను వీడి శాశ్వతసుఖము ననుభవింపుము.

190.    నహ్వే కార్యకర్తా నహ్వే సృష్టిభర్తా

            పరేహూని పర్తా న లింపే వివర్తా |

            తయా నిర్వికల్పాసి కల్పీత జావే

            పరీ సంగ సోడూని సూఖే రహావే || శ్రీ రాం||

 ఓ మనసా! నిర్గుణ పరమాత్మ సృష్టి భర్తయునుగాడు, కార్యకర్తయును గాడు, పర వాణికి పరముననుండి  పరాత్పరుడై యున్నాడు .  మాయాభ్రమలచ్చట ప్రవేశింపజాలవు.అట్టి నిర్గుణ బ్రహ్మమును కల్పించుచు సర్వసంగములను వీడి (నేను కల్పించుచున్నాను అనెడి సంకల్పమును గూడ ) సుఖి వై యుండుము

మనాచీ శ్లోకములు (181—185)

18 Sep

181.   నహ్వే చేటకీ చాళకూ ద్రవ్యభోదూ

          నహ్వే నిందకూ మత్సరూ భక్తిమందూ |

          నహ్వే ఉన్మతూ వేసనీ సంగబంధూ

          జగీ జ్ఞానియా తో చి సాధూ అగాధూ || శ్రీ రాం ||

 మనసా! బూటక విద్యలు లేక, వంచించి ద్రవ్య మపహరింపక పరనింద మాత్స్యర్యము భక్తి రహితత్వములేక, గర్వము , దుర్వ్యసనములు లేక అగాధమగు జ్ఞానము గల్గి లోకమునకు సన్మార్గము జూపువాడే సద్గురు పదమున కర్హుడు.

182.  నహ్వే వావుగీ చాహుటీ కామ పోటీ

          క్రియేవీణ వాచాళతా తేచి మోఠీ |

          ముఖే బోలిల్యాసారిఖే చాలతాహే

          మనా సద్గురూ తోచి శోధూని పాహే || శ్రీ రాం ||

 మనసా ! వ్యర్థప్రసంగముచేత కాలము గడుపు వాడును,కామాసక్తుడును  ఉదర పోషణ కొఱకనేకాడంబరములును వాక్చాతుర్యములను జూపు వాడును సద్గురు స్థానమునకనర్హుడు. నోట నుచ్చరించెడి బ్రహ్మ జ్ఞానము ననుసరించి యెవ్వని నిత్యజీవితమును నాచరణ ముండునో యట్టిసద్గురుని వెదకి కనుగొనుము.

 183.   జనీ భక్త జ్ఞానీ వివేకీ విరాగీ

            కృపాళూ మనస్వీ క్షమావంత యోగీ |

            ప్రభూ దక్ష వ్యుత్పన్న చాతుర్య జాణే

            తయాచేని యోగే సమాధాన బాణే ||శ్రీ రాం ||

 మనసా! భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నుడును దయాసముద్రుడును,జితేంద్రియుడును,క్షమావంతుడు,అఖండధ్యానస్థుడును, సర్వశక్తిసంపన్నుడును, శౌర్యవంతుడును , విద్యావంతుడగు వాడే సద్గురు పదమున కర్హుడు.

 184.     నహ్వే తేచి జాలే నసే తేచి ఆలే

             కళో లాగలే సజ్జనాచేని బోలే |

             అనిర్వాచ్య తే వాచ్య వాచే వదావే

             మనా సంత ఆనంత శోధీత జావే ||శ్రీ రాం ||

 మనసా! కేవల మిథ్యాభాసమానమైన అస్తిత్వమే లేని  యీ జగత్తంతయు భాసమానమెట్లగుచున్నదో యెందులకగుచున్నదో సజ్జనబోధనల వలన చక్కగ నెరుగగలవు అట్టి అనిర్వాచ్య బ్రహ్మస్థితి సజ్జనుల బోధలు లేనిదే మనవుడెరుగజాలడు. బోధనొందిన తర్వాత సజ్జనులు బలికెడి క్రమమున దానిని మానవుడే స్వయముగ సాధింపవలయును.

185.   లపావే అతీ ఆదరే  రామరూపీ

           భయాతీత నిశ్చింత యో సస్వరూపీ  |

           కదా తో జనీ పాహతాం హీ దిసేనా

           సదా ఏక్య తో భిన్నభావే వసేనా ||శ్రీ రాం ||

 మనసా! నిజము విచారించిన నీ స్వరూపమే రామ రూపము.రామస్వరూపమే నీ స్వరూపము.అత్యాదరముచే నట్టి స్వరూపమును జేరగల్గితివేని తరువాత నెట్టి భయములు గాని యుండజాలవు.అట్టివాడేకాంతముననే రమించుచు ఎచ్చట సంచరించినను  తనయేకాంత సమాధానస్థినిబోగొట్టుకొనజాలడు. 

మనాచీ శ్లోకములు (176—180)

16 Sep

176.    జగీ ద్వాదశాదీత్య హే రుద్ర ఆక్రా

            అసంఖ్యాత సంఖ్యా కరీ కోణ శక్రా |

            జగీ దేవ ధుండాళితాం ఆఢళేనా

            జనీ ముఖ్య తో కోణ కైసా కళేనా || శ్రీ రాం ||

మనసా ! సృష్టియందు ద్వాదశ సూర్యులు,ఏకాదశ రుద్రులును,గణనాతీతులగు ఇంద్రులున్నారు.అట్టి దేవతల కందరికి నియామకుడగు ముఖ్యదేవుడు శోధించినను కనిపించుట లేదు. అట్టి ముఖ్యదేవుని సందర్శన భాగ్యములేనిదే ముక్తి దొరుకుట దుర్లభము.

177.   తుటేనా పుటేనా కదా దేవరాణా

           చళేనా ఢళేనా కదా దైన్యవాణా |

           కళేనా కళేనా కదా లోచనాసీ

           వసేనా దిసేనా జనీ మీపణాసీ  || శ్రీ రాం ||

 మనసా! అట్టి ముఖ్యదేవుడు వికార రహితుడును,నాశరహితుడునై యున్నడు. అతని యందు చలనములు గాని, భయములు గాని దీనత్వము గాని లేదు.కంటికి గోచరించువాడు కాడు.అహంకార ముండు వరకు ముఖ్యదేవుని జాడ తెలయుట కూడ నసాధ్యము. 

178.   జయా మానలా దేవతో పూజితాహే

           పరీ దేవ సోధూని కోణీ పాహే |

           జగీ పాహతాం దేవ కోట్యానుకోటీ

           జయా మానిలీ భక్తి జే తేచి మోఠీ || శ్రీ రాం ||

మనసా! ఎవ్వని కే దేవుని యందుశ్రధ్ధ కుదిరినదో వాడా దేవునే పూజించుచున్నాడు. అయితే దేవాధిదేవుడగు ముఖ్యదేవు నెవ్వరూ శోధించుట లేదు.జగత్తు నందు కోటానుకోట్ల దేవతలును, అట్టి దేవతల భజించు వారును గలరు.ఎవ్వని యారాధ్య దైవము వానికి సర్వోత్తమముగ దోచునే గాని ముఖ్యదేవుని వెదుకు వారరుదు.

179.   తిన్ హీ లోక జేధూని నిర్మాణ జాలే

            తయా దేవరాయాసి కోణీ బోలే |

            జగీ థోరలా దేవ తో చోరలాసే

            గురూవీణ తో సర్వథాహీ దీసే || శ్రీ రాం ||

మనసా! మూడు లోకములెవ్వని మహిమచే నిర్మింపబడు చున్నవో అట్టి ముఖ్యపరమేశ్వరునెవ్వరు విచారించుట లేదు.అట్టి ముఖ్య పరమేశ్వరుడు సామాన్య మానవులకగోచరుడై యున్నాడు సద్గురు కృపాకటాక్షము లేనివారికి ముఖ్యదేవుని దర్శన మబ్బుట సాధ్యము కాని పని.

180.  గురూ పాహతాం పాహతాం లక్ష కోటి

           బహుసాల మంత్రావళీ శక్తి మోటి |

           మనీ కామనా చేటకే ధాతమాతా

           జనీ వ్యర్థ రే తో నహ్వే ముక్తిదాతా ||శ్రీ రాం ||

మనసా! ప్రపంచమున పరమార్థ దాతలమగు  గురువులమని చెప్పుకొని మంత్రతంత్ర సామర్థ్యములు జూపి జనుల మోహింపజేయు గురువులుకోట్ల కొలది యున్నవారు. అట్టి వారు దుర్వ్యసనాబధ్ధులై బూటక విద్యల నేర్చి శబ్ధ పాండ్త్యము గలవారై జనుల వంచించుచున్నారు. అట్టి వారు ముక్తి దాతలు కాజాలరు.

మనాచీ శ్లోకములు (171—175)

5 Sep

171.   అసే సార సాచార తే చోర లేసే

          ఇహీ లోచనీ పాహతాం దృశ్య భాసే |

          నిరాభాస నిర్గూణ తే ఆకళేనా

          అహంతాగుణే కల్పితాంహీ కళేనా  || శ్రీ రాం ||

 మనసా! సత్యమగు ఆత్మవస్తువు సర్వత్ర వ్యాపించియుండి నను,గోచరింపక చర్మ చక్షువులచే చూచి, ఆత్మకు భిన్నమగు ప్రపంచమే భాసమానమగు చున్నది. నిరాభాసమును,నిర్గుణమును ,అగు ఆత్మ వస్తువును మానవుడహంకార యుక్తుడై కల్పింపనెంత ప్రయత్నించినను ,తెలియుటకసాధ్యము.

172.   స్ఫురే వీషయీం కల్పనా తే అవిద్యా

           స్ఫురే బ్రహ్మరే జాణ మాయా సువిద్యా |

           ముళీ కల్పనా దో రూపే తే చి జాలీ

           వివేకే తరీ సస్వరూపీ మిళాలీ || శ్రీ రాం ||

 మనసా! విషయ స్ఫురణము గావింపజేసెడి కల్పనలన్నియూ, మానవును ప్రవృత్తి మార్గమున బడవైచి జన్మ మరణముల గలుగజేసి, అవిద్యకు కారణమగుచున్నవి. బ్రహ్మస్ఫురణము గావింపజేసి మానవుని నివృత్తి మార్గమున ప్రవేశపెట్టెడి  కల్పనలు సద్విద్యారూపమున పరిగణింపబడుచున్నది. పై రెండు విధములైన స్ఫురణలు మనఃకల్పితములే అయినను, ప్రవృత్తి మార్గము ప్రపంచోన్ముఖముగనున్నది.నివృత్తి మార్గము ఆత్మోన్ముఖమై సాయుజ్య ముక్తి నొసగుచున్నది.

173.    స్వరూపీ ఉదేలా అహంకార రాహో

           తేణే సర్వ అచ్ఛాదిలే వ్యోమ పాహో |

           దిశా పాహతాం తే నిశా వాఢ తాహే

           వివేకే విచారే వివంచూని పాహే || శ్రీ రాం ||

 మనసా! ఆత్మ యనెడి ఆకాశమందు అహంకారమనెడి రాహువు ఉద్భవించుటచే అట్టి అహంకారమనెడి రాహువు ఉద్భవించుటచే అట్టి అహంకారముచే ఆత్మాకాశము ఆచ్ఛాదింపబడినలువైపుల అంధకార వ్యాప్తి గలుగుచున్నది.అట్టి అహంకార  రాహువుద్భవించుట కేవలం మిధ్యాభాసమానమే  గానీ సత్యదృష్టి కాజాలదు. అందుచే వివేకవిచారముచే పరిశీలించినచో అనగా అహంకారమును త్యాగము గావించినచో సత్య వస్తువే అనగా ఆత్మయే గోచరింపగలదు.

174.   జయా చక్షునే లక్షితాం లక్షవేనా 

           భవా భక్షితాం రక్షితాం రక్షవేనా |

           క్షయాతీత తో అక్షయీ మోక్ష దేతో

           దయాదక్ష తో సాక్షినే పక్ష ఘేతో || శ్రీ రాం ||

 మనసా! పరబ్రహ్మవస్తువు చర్మచక్షువులకు  గోచరింపదో అట్టి బ్రహ్మసాక్షాత్కారము , భాగ్యవశమున మానవుని కబ్బినచో మరల ప్రపంచ భావములుండుటకు సాధ్యము కాదు. అట్టి క్షయాతీతమగు పరమాత్మయే శక్తుల సంరక్షించుటకై యుగయుగముల సగుణుడై అవతరించుచున్నాడు.

175.   విధీ నిర్మాతాం లీహితో సర్వ భాళీ

           పరీ లీహితా కోణ త్యాచే కపాళీ |

           హరు జాళితో లోక సంహారకాళీ

           పరీ సేవటీ శంకరా కోణ జాళీ || శ్రీ రాం ||

మనసా! సృష్ట్యారంభమునందే జీవులనొసట  జనన మరణాదులు లిఖించుచున్నాడు.అట్టి బ్రహ్మనెవరు సృష్టించిరి? బ్రహ్మ నొసటలిఖించిన దెవరు? ప్రళయకాలమున శంకరుడు లోకసంహారమొనర్చుచున్నాడు చివరకు అట్టి శంకరుని సంహరించువాడెవడు? 

మనాచీ శ్లోకములు (166—170)

3 Sep

166.   అహంకార విస్తారలా యా దేహాచా

           స్త్రియా పుత్ర మిత్రాదికే  మోహ త్యాంచా |

           బళే భ్రాంతి హే జన్మ చింతా హరావీ

           సదా సంగతీ సజ్జనాచీ ధరావీ || శ్రీ రాం ||

 మనసా !  దేహమునకు జన్మమునకు అహంకారమే కారణమై , స్త్రీ ,పుత్ర, మిత్ర ,మోహరూపమున విస్తారమగుచున్నది. అట్టి విస్తారము జన్మ మరణ  బంధహేతువగును. గాన అట్టి బంధ విముక్తి కై  సజ్జనుల నాశ్రయించి వారిని సదా సేవించుచుండుము. 

167.  బరా నిశ్చయో శాశ్వతాచా కరావా

          హ్మణే దాస సందేహతో వీసరావా |

          ఘడీనే ఘడీ  సార్థకాచీ కరావీ

           సదా సంగతీ సజ్జనాచీ ధరావీ || శ్రీ రాం ||

 మనసా ! ప్రపంచమోహములనువదలి దేహబుధ్ధులను త్యాగము గావించి ,శాశ్వతమగు బ్రహ్మవస్తువనెడి  దృఢమగు సత్యసంకల్పము గావించి,సర్వ సందేహముల విడనాడి అట్టి ఆత్మ పద ప్రాప్తికై జీవిత మందలి ప్రతినిమిషమును ప్రయత్నము గావించుచు హరి చింతనచే దేహము సార్థక మొనరించుచు బ్రహ్మపద ప్రాప్తికై సజ్జనుల నాశ్రయించి వారిని సర్వకాలము సేవింపుచుండుము.

168.   కరీ వృత్తిజో సంత తో సంత జాణా

           దురాశా గుణే జో నహ్వే దైన్య వాణా 

           ఉపాధీ దేహబుధ్ధితే వాఢవీతే 

           పరీ సజ్జనా కేవి బాధూం శకేతే || శ్రీ రాం||

మనసా! ఎవ్వడు  తన మనోవృత్తులను బ్రహ్మాకారము గావించు యున్నాడో, అట్టివాడే సజ్జనుడని తెలిసికొనుము. అట్టివానికి స్వర్గసుఖములందు గాని, అష్ట సిధ్ధులందు గాని దురాశలెంత మాత్రము నుండవు.అట్టి వానికి దీనత్వము అణుమాత్రముండజాలదు. దేహ బుధ్ధులను వృధ్ధి పొందించెడు ప్రపంచ ఉపాధులు అట్టి వాని కుండజాలవు.

169.    నసే అంత ఆనంత సంతాం పుసావా

           అహంకార విస్తార హా నీరసావా |

           గుణేవీణ నిర్గూణ తో ఆఠవావా

           దెహేబుధ్ధిచా ఆఠవో నాఠవావా || శ్రీ రాం||

 మనసా! అనంతమగు బ్రహ్మవస్తువును తెలిసికొనగోరినచో అట్టి విషయమునకై సజ్జనులచెంత వినమ్రుడవై ప్రార్త్ర్హింపుము. అహంకార విస్తార రూపమగు దేహబుధ్ధులందు మరచి నిర్గుణమగు పరబ్రహ్మమునే స్మరించు చుండుము.

 170.   దేహబుధ్ధి హే జ్ఞానబోధే త్యజావీ

            వివేకే తయే వస్తుచీ భేటి ధ్యావీ |

            తదాకార హే వృత్తి నాహీ స్వభావే

            హ్మణోనీ సదా తేచి శోధీత జావే || శ్రీ రాం||

 మనసా! దేహబుధ్ధులను వివేకముచే  త్యాగము గావించి బ్రహ్మవస్తు ప్రాప్తిని సంపాదింపుము. మనఃప్రవృత్తులు సామాన్య మానవునకు బ్రహ్మాకారమును పొందక విషయాకారమును జెంది ఇంద్రియముల ద్వారా విషయసేవను జేయుటకు ప్రయత్నించుచుండును. మనస్సు యొక్క స్వభావము బాహ్యవిషయముల పై సంచరించుట సహజము గాన అట్టి చంచల స్థితి నుండి మనస్సును తప్పించి అంతర్ముఖము గావించి బ్రహ్మాకారము గావించు అభ్యాసము సర్వకాలము జాగరూకుడై మానవుడు చేయుచుండవలెను.

మనాచీ శ్లోకములు (161—165)

1 Sep

161.  అహంతాగుణే సర్వహీ దుఃఖ హోతే

         ముఖే బోలితే జ్ఞాన తే వ్యర్థ జాతే |

         సుఖీ రాహతాం సర్వహీ సూఖ అహే

         అహంతా తుఝీ తూంచి సోధూని పాహే ||శ్రీ రాం ||

 మనసా ! అహంకారముచే  మానవులు దుఃఖముననుభవింపవలసి వచ్చును అహంకారయుక్తుడు చెప్పెడి జ్ఞానము శ్రోతల యందు పరిణామము గలుగజేయ జాలక వ్యర్థమై పోవుచున్నది. కావున నీయందలి అహంకారమును శోధించి త్యజింపగలిగినచో సర్వసుఖములు బొందగలవు.

162.   అహంతాగుణే నీతీ సాండీ వివేకీ

           అనీతీబళె శ్లాధ్యతా సర్వ లోకీ |

           పరీ అంతరీ సర్వహీ సాక్ష యేతే

           ప్రమాణాంతరే  బుధ్ధి సాండూని జాతే ||శ్రీ రాం ||

 మనసా! సర్వమెఱిగిన వివేకవంతులు సహిత మహంకారమునకు లోనై యవినీతికరములగు కార్యముల నాచరించుచునే లోకమున మానమర్యాదలు పొంది గొప్పవారనిపించు కొనుచు వర్తించుట హస్యాస్పదము! తాము చేయు కార్యములు తప్పని తమ యంతరంగములకుదోచుచుండినను బుధ్ధి యహంకారములచే గప్పియుండుటచే,శాస్త్రబలముచే  బ్రమాణవాక్యముల నడ్డుపెట్టుకొని వానికి వేరొక అర్థం గల్పించి చెడుపనుల గావించుచునే యున్నారు. 

163.  దేహే బుధ్ధిచా నిశ్చయో దృఢ ఝాలా

          దేహేతీత తే హీత సాండీత గేలా |

          దేహేబుధ్ధి తే ఆత్మబుధ్ధీ కరావీ

          సదా సంగతీ సజ్జనాచీ ధరావీ ||శ్రీ రాం ||

 మనసా! దేహమే నేననెడి బుధ్ధి మానవునకు వృధ్ధినొందినచో ఆత్మబుధ్ధులడుగంటిపోవుచున్నవి. అనగా నేను బ్రహ్మననెడి బుధ్ధులు మాయమగుచున్నవి. అట్టి దేహబుధ్ధులను ఆత్మబుధ్ధులుగా మార్చుటకు సజ్జనులనాశ్రయించి సర్వదా వారిని సేవింపుము.

164.  మనే కల్పిలా వీషయో సోడవావా

          మనే దేవ నిర్గూణ తో వోలఖావా |

          మనే కల్పితాం కల్పనా తే సరావి

          సదా సంగతీ సజ్జనాచీ ధరావీ ||శ్రీ రాం ||

మనసా ! నేను దేహమనెడి కల్పనలను బోగొట్టుకొనుటకై మానవుడునేను బ్రహ్మననెడి సంకల్పముల గావింపవలెను. తుదకు అహంబ్రహ్మాస్మియనెడి  సంకల్పములను గూడ వదలి బ్రహ్మయందైక్య మొందవలెను.అట్లు గావించుటకు సజ్జన సాంగత్యము ఆవశ్యము సాధింపవలయును.

165.    దేహాదీక ప్రపంచ హా చింతియేలా

            పరీ అంతరీ లోభ నిశ్చిత ఠేలా |

            హరిచింతనే ముక్తికాంతా  వరావీ

            సదా సంగతీ సజ్జనాచీ ధరావీ ||శ్రీ రాం ||

 మనసా ! దేహగేహాది ప్రపంచ చింతలనే చేయచుండినచో అంతరంగమున లోభాదివాసనలు దృఢమై జన్మమరణములకు సుఖదుఃఖములకు కారణములగుచున్నవి అట్లుచేయక హరిచింతనచే ముక్తి కాంతను వరింపగోరి అట్టి కాంతను సమకూర్చెడి సజ్జనుల నాశ్రయించి సదా సేవింపుచుండుము.

మనాచీ శ్లోకములు (156—160)

30 Aug

156.  హ్మణే జాణతా తో జనీ మూర్ఖ పాహే

          అతర్కాసి తర్కీ అసా కోణ ఆహే |

          జనీ మీపణే పాహతాం పాహవేనా

          తయా లక్షితాం వేగళే రాహవేణా  || శ్రీ రాం ||

మనసా ! అనిర్దేస్యమై ,అతర్క్యమై ,మనస్సునకందరాని పరబ్రహ్మ వస్తువును నేను తెలిసికొన్నానని   చెప్పెడి మానవుడు  నిస్సంశయముగ మూర్ఖుడు. అట్టివస్తువు అహంకారముండునంత వరకు గోచరించునది కాదు. పరబ్రహ్మ దర్శనానుభవము గల్గిన వాడు పరబ్రహ్మ నుండి విలక్షనుడిగ నుండి నేను చూచితినని చెప్పజాలడు.

157.  బహూ శాస్త్ర ధుండాళితాం వాడ ఆహే

          జయా నిశ్చయో ఏక తోహీ సాహే |

         మతీ భాండతీ శాస్త్ర బోధే విరోధే

         గతీ ఖుంటతీ జ్ఞానబోధే ప్రబోధే || శ్రీ రాం ||

 మనసా ! పరస్పర విరుధ్ధాభిప్రాయములచే కలహించెడి శాస్త్ర జన్య జ్ఞానములచే పరబ్రహ్మ స్థితి లభింపదు. జ్ఞానోదయములు గలిగిననే గాని వాదములంతమొందవు.

 158.  శ్రుతీ న్యాయ మీమాంసకే తర్కశస్త్రే 

           స్మృతీ వేద వేదాంతవాక్యే విచిత్రే  |

           స్వయే శేష మౌనావలా స్థీర పాహే

           మనా సర్వ జాణీవ సాండునరాహే  || శ్రీ రాం ||

 మనసా ! స్రృతి స్మృతి పురాణ జ్ఞానము చేగాని, తర్క వ్యాకరణ మీమాంస వేదాంత  జ్ఞానముచే గాని, ఆత్మానుభవము గలుగ జాలదు. సహస్రముఖములు గల శేషుడే మౌనము వహించియుండ మానవుల గతియేమి? కావున పరబ్రహ్మానుభవమునకు  జ్ఞానగర్వము వదులుము.

159.  ఝేణే మక్షిఖా భక్షిలీ జాణివేచీ 

          తయా భోజనచీ రుచీ ప్రాప్తి కైచీ |

          అహంభావ జ్యా మానసీచా విరేనా

         తయా జ్ఞాన హే అన్న పోఠీ జిరేనా  || శ్రీ రాం ||

 మనసా! ఎవ్వడు జ్ఞానినని జ్ఞానగర్వము గలిగియున్నాడో అట్టివాని జ్ఞానము వానికి బ్రహ్మ ప్రాప్తిని గలిగింపజాలదు.ఎందుకనగా భోజనము వెంట మక్షిక కడుపు లోనికేగి సంచరించినచో అట్టి భోజనము ఆకలి దీర్పజాలక వమనమగునట్టులే జ్ఞానగర్వమను మక్షిక చే సమాధాన సుఖము కలుగజాలదు. 

160.  నకో రే మనా వాద హా ఖేదకారీ 

           నకో రే మనా భేద నానా వికారీ  |

           నకో రే మనా సీకవూ పూఢిలాంసి

           అహంభావ జో రాహిలా తూజపాసీ || శ్రీ రాం ||

 మనసా! వాదములన్నియు దుఃఖకారకములు  గనుకను,భేదబుధ్ధులు వికార జనకములగుటచే,తను వాటిని సంపూర్ణముగ త్యజింపుము.అభిమాన,అహంకారములకు లోబడియుండు వరకు మనవుడితరులకు జ్ఞానబోధ జేయుటకు బూనుకొనరాదు.